ENGLISH | TELUGU  

ఇ.వి.వి.సత్యనారాయణ వంటి డైరెక్టర్‌ మరొకరు లేరు అని చెప్పడానికి ఇదే నిదర్శనం!

on Jun 10, 2025

(జూన్‌ 10 దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ జయంతి సందర్భంగా..)

నవరసాల్లో అన్నింటికంటే కష్టమైనది, అందరికీ ఇష్టమైనది హాస్యరసం. నటీనటులందరికీ హాస్యాన్ని పండించడం సాధ్యం కాదు. అలాగే అందరు రచయితలు కామెడీ కథలు రాయలేరు, అందరు దర్శకులు కామెడీ సినిమాలు తియ్యలేరు. ఒకప్పుడు సినిమాల్లో కామెడీని ఒక ట్రాక్‌గా పెట్టి నడిపించేవారు. కథతోపాటు ప్యారలల్‌గా కామెడీ ట్రాక్‌ నడిచేది. దాని కోసం ప్రత్యేకంగా కమెడియన్స్‌ ఉండేవారు. అది కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. అడపా దడపా పూర్తి హాస్య సినిమాలు కూడా వచ్చేవి. అయితే పూర్తి స్థాయిలో కామెడీ సినిమాలు వెలుగులోకి వచ్చింది 1980వ దశకం నుంచి. 1981లో ఒక్క నెల తేడాతో ఇద్దరు దర్శకులు టాలీవుడ్‌కి వచ్చారు. ఆగస్ట్‌లో ‘నేను మా ఆవిడ’ చిత్రంతో రేలంగి నరసింహారావు, సెప్టెంబర్‌లో ‘ముద్ద మందారం’ చిత్రంతో జంధ్యాల పరిచయమయ్యారు. ఈ ఇద్దరు దర్శకులు ఆ తర్వాతి కాలంలో కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. వీరి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. ఆద్యంతం నవ్వులు పూయించే సినిమాలు తీసి హాస్యప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. కామెడీ సినిమాల్లో ఈవీవీ అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అసలు ఇ.వి.వి.సత్యనారాయణ నేపథ్యం ఏమిటి? ఆయన సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? హాస్య చిత్రాల దర్శకుడిగా ఆయన ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాలు తెలుసుకుందాం.

1956 జూన్‌ 10న పశ్చిమగోదావరి జిల్లా దొమ్మేరులో వెంకటరావు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు ఈదర వీర వెంకట సత్యనారాయణ. ఈవీవీకి చిన్నతనం నుంచీ సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఇంటర్‌ చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్లకుండా రోజుకి రెండు, మూడు సినిమాలు చూడడం వల్ల పరీక్ష తప్పారు. దాంతో చదువు మాన్పించేసి పొలం పనులకు తీసుకెళ్లారు తండ్రి. అలా రెండు సంవత్సరాలు పనిచేశారు ఈవీవీ. అదే క్రమంలో 1976లో 19 ఏళ్ళ వయసులోనే సరస్వతికుమారితో ఈవీవీ వివాహం చేశారు. వారికి ఇద్దరు కొడుకులు రాజేష్‌, నరేష్‌ కలిగారు. ఆ తర్వాత వ్యవసాయంలో నష్టం రావడంతో పొలం అమ్మెయ్యాల్సి వచ్చింది. కుటుంబానికి అలాంటి పరిస్థితి ఏర్పడడంతో ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిర్మాత నవత కృష్ణంరాజు బంధువు అదే ఊరిలో ఉండడంతో ఆయన దగ్గరి నుంచి ఒక రికమండేషన్‌ లెటర్‌ తీసుకొని మద్రాస్‌ రైలెక్కేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కృష్ణంరాజు బేనర్‌లో ఓ అవకాశం దక్కింది. దేవదాస్‌ కనకాల దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఓ ఇంటి భాగోతం చిత్రానికి అసిస్టెంట్‌గా ఈవీవీని తీసుకున్నారు. 

ఆ తర్వాత జంధ్యాల దగ్గర అసోసియేట్‌గా 8 సంవత్సరాలపాటు 22 సినిమాలకు పనిచేశారు. ఆ సమయంలోనే ఈవీవీకి డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తానని చెప్పారు రామానాయుడు. అయితే తను నిర్మిస్తున్న ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి అసోసియేట్‌గా పనిచేయమన్నారు. ఆ సినిమా పూర్తయినప్పటికీ రామానాయుడు అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ సమయంలోనే రామానాయుడు మేనల్లుడు అశోక్‌కుమార్‌.. ఈవీవీతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. అలా అతను డైరెక్ట్‌ చేసిన తొలి సినిమా చెవిలో పువ్వు 1990లో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సినిమా హిట్‌ కాకపోయినా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవీవీ. అదే సంవత్సరం రామానాయుడు తన బేనర్‌లో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. హరీష్‌, మాలాశ్రీ జంటగా ఈవీవీ చేసిన ప్రేమఖైదీ చాలా పెద్ద హిట్‌ అయింది. 

ఆ తర్వాత ఈవీవీకి వరసగా అవకాశాలు వచ్చాయి సీతారత్నంగారి అబ్బాయి, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆలీబాబా అరడజను దొంగలు, అబ్బాయిగారు, వారసుడు, జంబలకిడి పంబ, హలో బ్రదర్‌, అల్లుడా మజాకా, ఆయనకి ఇద్దరు, మావిడాకులు వంటి సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించారు. ఈ సినిమాల్లో కొన్ని పూర్తి స్థాయి కామెడీ సినిమాలు కాగా, మరికొన్ని కుటుంబ కథా చిత్రాలు ఉన్నాయి. చక్కని కథ ఉంటూనే కామెడీ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకునేవారు ఈవీవీ. అలాగే ఆమె, తాళి, ఆరుగురు పతివ్రతలు వంటి మహిళా ప్రధాన చిత్రాలు కూడా చేశారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మా నాన్నకు పెళ్లి, ఆవిడా మా ఆవిడే, కన్యాదానం, చాలా బాగుంది, ఎవడిగోల వాడిది సినిమాలు ఈవీవీ చేసిన సూపర్‌హిట్‌ సినిమాల్లో కొన్ని మాత్రమే. ఈవివి సినిమా పేరుతో ఓ బేనర్‌ను స్థాపించి కొన్ని సినిమాలు కూడా నిర్మించారు ఈవీవీ. 

ఈవీవీ పెద్ద కుమారుడు ఆర్యన్‌ రాజేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ హాయ్‌ అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హీరోగా అంతగా సక్సెస్‌ అవ్వలేదు రాజేష్‌. ఇక చిన్న కుమారుడు నరేష్‌.. అల్లరి చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్‌ అయ్యారు. అయితే కామెడీ హీరోగా నరేష్‌ మంచి పేరు తెచ్చుకొని ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు. నరేష్‌తోనే ఈవీవీ చాలా సినిమాలు చేశారు. చివరగా 2010లో ఆయన దర్శకత్వంలో వచ్చిన బురిడీ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. దాదాపు సంవత్సరంపాటు అనారోగ్యంతో బాధపడిన ఈవీవీ 2011 జనవరి 21న తుది శ్వాస విడిచారు. ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సినిమాలు రూపొందించారు ఈవీవీ.  ఆయన తర్వాత ఆ స్థాయిలో హాస్య చిత్రాలు చేసే దర్శకుడు టాలీవుడ్‌లో మరొకరు కనిపించలేదు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.